Wednesday, September 2, 2015

వెన్నెల విరహం - 6

ఎంత పిచ్చివాడినో కదా
జ్ఞాపకాలు నవ్వుతున్నాయి
వెళుతున్న నిన్నొదిలేసి
వాటిని దాచుకున్నానని

అప్పుడు తెలీలేదు
నీ నిశబ్ద సంగీతం నన్నల్లుకుంటుంటే
నా మది నావకి చిల్లు పడిందని
నీ ప్రేమ కడలిలో మునిగిపోయిందని

కాలిపోయిన ఒంటరితనం
మళ్ళీ ప్రాణం పోసుకుని
కాటుక పూసుకున్న క్షణాలని
వెన్నెల లేని రాత్రులని లేక్కేస్తోంది

ఎదురుచూస్తుంటా
వియోగపు క్షణాలకి
నీ తలపుల తెనేరాస్తూ
నా గుండె శబ్దం ఆగేవరకు...

Wednesday, August 12, 2015

"శ్రీమంతుడు" రివ్యూ - మంచోడు - మంచోడంటే... మనలా కాదు - అదో రకం..!

నా చిన్నప్పుడు దూరదర్శన్ ఒక్కటే channel. so, పొద్దుట్నించీ tv, కోమాలో ఉన్న కోడిపిల్ల లాగా చడీ చప్పుడూ లేకుండా పడుండేది. ఆత్రం ఆపుకోలేక on చేసినా, black n white dots తప్ప ఇంకేం ఉండేది కాదు. కానీ సాయంత్రం 4 గంటలకల్లా, స్కూల్ నించీ వచ్చి, బ్యాగ్ ని గిరాటేసి, మంచినీళ్ళు తాగి, fresh అయ్యామనిపించుకుని, tv ముందు కూర్చుని, ఆశగా చూసేవాళ్ళం.  మబ్బుల్ని చూసి నెమలి లాగా, ముందు, rainbow color లో stripes, కుయ్.... మని sound వచ్చేది. అదేదో హాలీవుడ్ గ్రాఫిక్ సినిమా లాగా అందర్నీ పోగేసి, మాట్లాడొద్దు అని, దీక్షగా చూసే వాళ్ళం. అమ్మ ఇచ్చే snacks కూడా tv screen చూస్తూనే తినేవాళ్ళం. అక్కడేం మాయ దాగుందో ఎవ్వరికీ తెలీదు. కానీ ఎవ్వరూ కళ్ళు తిప్పుకోరు. సరే, ఒక అరగంట కుయ్ మన్నాక, టారడరడా.... టరడారడా.... టారడరడా.... అని ఒక గుండ్రం, దాని చుట్టూ రక్షణ వలయం... అంతే, ఇంక ఆ తర్వాత ఏమొస్తుందో అందరికీ తెల్సు... పందుల పెంపకమో, పేనుబంక నివారణో... అవి పిల్లలకంత interesting గా ఉండేవి కాదు కాబట్టి, ఆడుకోడానికి పరిగెత్తే వాళ్ళం. ఇంత ముక్తాయింపు ఇప్పుడెందుకంటే...
నిన్న శ్రీమంతుడు సినిమాకెళ్ళాం... పై వర్ణన గుర్తొచ్చింది. ఏం మాయుందో కానీ, కూర్చున్న 2 hr. 43 min. మహేష్ ఎంత బావున్నాడు, ఏం maintain చేస్తున్నాడు ? fight లో కూడా ఆ style, ఈ shirt color బావుందా ? ఇందాకటి ash color బావుందా ? ఆ coat లో అసలు అద్దిరిపోయాడు, శ్రుతి హాసన్ కూడా blur అయిపోయింది... ఇదీ వరస. dialogues, screen play, story, comedy, background score...ఇవన్నిటి గురించీ ఏం చెప్పవా ? అంటే, ఇంకోసారి సినిమా చూస్తేనే గానీ చెప్పలేను. అది కూడా guarantee లేదు. అతడు భాషలో చెప్పాలంటే, ఎవరైనా, ఇప్పుడు బెంజ్ అయినా, ఏజ్ బార్ అయ్యాక అంబాసిడర్ అవుతారు. కానీ బెంజ్ నించీ ఆడి, రోల్స్ రాయిస్ ఇంకా... ఏ posh cars అయితే అవి, నాకంత idea లేదు... అలా తయారవుతుంటే how ? అహ... how ? final గా, ధర్మవరపు గారు అదే సినిమాలో చెప్పినట్టు, మన మిగతా తెలుగు సినిమాల్లో హీరోలు ఈ మాదిరి screen presence ఉండదెందుకు ? అంటే, ఎందుకు ఉండదు ?  కాకపోతే వాటిల్లో కూడా Mahesh ఏ act చెయ్యాలి... అనాలేమో..! అయిందా Mahesh భజన ? అంటారా ? ఈ సారి కచ్చగా రెండోసారి చూసి, సినిమా రివ్యూ రాయాలి. story line బావుంది... taking ఇంకొంచెం మెరుగై ఉంటే బావుండేది. కానీ సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే, సినిమా బావుంది. ఉహు... మహేష్ బావున్నాడు - బావుండడం అంటే మామూలుగా కాదు... అదో రకం..! Overall - "శ్రీమంతుడు" మంచోడు - మంచోడంటే... మనలా కాదు - అదో రకం..!

Sunday, August 2, 2015

వెన్నెల విరహం - 5

ఎప్పుడు సమాధయ్యాయో
నీవు లేని నిన్నటి క్షణాలు
ఆ క్షణానికెంత గర్వమో చూడు
నిన్ను పరిచయం చేసినందుకేమో ....
కొన్ని పరిమళాలు వాడిపోవు
నీతో పోగేసుకున్న జ్ఞాపకాల్లా
తడిసి ముద్దయ్యే నా మదిని చూసావా?
నీ తలపుల జలపాతాలలో ...
ఎప్పుడు జీవం పోసుకున్నానో నాకు తెలీని నేను
మరణంలో నుండి జీవనంలోకి అంటే ఇదేనేమో
ఓడిపోతూనే వున్నా ..వెతికినప్పుడల్లా
నా ప్రపంచంలో నీవులేని కొద్ది స్థలం కోసం
నువ్వు నిర్వచించాకే తెలిసింది 
ప్రేమంటే దేహాల్ని వివస్త్రలు చేయడం కాదు
ఒకరి మనసు మరొకరికి
నగ్నం గా చూపగలగడమే అని

Tuesday, July 28, 2015

వెన్నెల విరహం - 4

కొన్ని వసంతాలని గుప్పెట్లో పోసుకుని
నీతో గడిపిన క్షణాలని లెక్కేస్తుంటా
పునర్జన్మలు మరణించాకే కాదని
నువ్వొచ్చాకే అర్ధమయ్యింది
ప్రకృతి పరవశం , మల్లెల పరిమళం
వెన్నెల్లో తడవడం , తొలకరి జల్లుకి మట్టివాసనలు...
ఇవన్ని మాములు పదాలు ..ఒకప్పుడు
నా మనసుకుకి ఓ స్పందన ఉందని
నువ్వు స్పర్శించాకే తెలిసింది
నీ తలపుల మకరందాన్ని తాగుతూ
నీ మదికుసుమం చుట్తూ తిరిగే భ్రమరాన్ని
సోముడి రాకతో కలువలు , సూరీడి స్పర్శతో తామరలు
వికసించడం నిజమేనేమో... నన్ను చూస్తే అర్ధమవుతోంది
రెండు దేహాల అకర్షణకి
అందమైన పేరే ప్రేమనుకున్నాను
నువ్వొచ్చి నిర్వచించాకే తెలిసింది ...
భౌతిక వాంఛలకతీతంగా మనసులు రమించడమే అని.....

ఆదర్శ దాంపత్యం



హైస్కూల్ నుండి నిన్నటి వరకూ
తన గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పేసిన
జెన్యూన్ హస్బండ్ ట్రూత్ ఫుల్నెస్ తో
మొదలయిన మీ ఫస్ట్ నైట్ సాక్షిగా
నీది ఆదర్శ దాంపత్యమే...

నిన్నారుగజాల చీరలో చుట్టేసి తను మాత్రం
అర్ధనగ్న భామల అందాలను ఆబగా చూస్తూ
నాకేసిన నీ వంటకం రుచికి మెచ్చుకోలు
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే...

ఆఫీస్ లో ఎఫైర్స్ ఉన్న సుందరాంగుల్ని
ఓపెన్ గా ఇంటికాహ్వానించినప్పుడు
అవమానాలను, అనుమానాలను కొంగుతోపాటు దోపేసి
చిర్నవ్వులు చిందిస్తూ వారితో పరాచికాలాడిన
నీ లో లోపలి (ఘోస్ట్) హోస్టెస్ అద్భుత ఆతిధ్యాల
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే...

పదిమందిలో నీ అభిమానాన్ని దెబ్బ తీస్తూ
నిన్ను చిన్నబుచ్చినప్పుడు, కళ్ళలో తేలుతున్న
నీటి బుడగల్ని చప్పుడు లేకుండా పేల్చేసి
నీ ఎంసీపీ (MCP) హస్బండ్ ఆధిపత్యాన్ని
నవ్వుతూ అంగీకరించిన నీ నటనా చాతుర్యం
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే...

పండగ ముందు రోజు రాత్రి పట్టు చీర
కొనిచ్చి, నిన్ను మురిపించి నీకిష్టం లేకున్నా
బలవంతంగా నిన్ను మంచం మీదకి లాగినపుడు
నువ్వేవగించుకునే పడుపుగత్తె 
జ్ఞాపకం  సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే...

అత్తగారి ఆరళ్ళు, ఆడపడుచుల ఈసడింపులు
మామగారి వేధింపుల మధ్య నువు నలుగుతుంటే
తనకు మాత్రం అత్తగారింట గౌరవ మర్యాదల్లో
లోపం ఉందని, నిన్ను పుట్టింటికి పంపక పోతే
ఈ జన్మకింతేనని సరి పెట్టుకున్న నీ రాజీ మనస్తత్వం
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే...

ఇక వల్లకాదని తెగింపు వచ్చిన ఒక బలహీన క్షణంలో
ఎదురు చెప్పినపుడు నీ చెంప ఫెడేల్మనిపించిన తర్వాత
అమ్మవారి బొమ్మ ముందు మోకరిల్లిన నీ పతి దైవభక్తి
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే...

తన సక్సెస్ లన్నిటికీ క్రెడిట్ ఇవ్వకపోయినా
తన పార్టీస్ కి, ఫంక్షన్స్ కీ నిన్ను వెంట తిప్పుకుంటూ
సహధర్మ చారిణిగా నీపట్ల పబ్లిక్ గా గౌరవం నటించే
నీ మొగుడు కోపంలో చూపే బూతు సంస్కారం
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే...

నన్ను కాదంటే పూట తిండికి గతి లేదని నీ మొగుడు
ఈసడించినప్పుడల్లా స్వేచ్చగా బ్రతికే పక్కింటి డైవొర్సీని
సీక్రెట్ గా ఎడ్మైర్ చేస్తూ నీ పట్టు చీరలు, నగలు ముందు
ఆమె సాదా సీదా జీవితం వెలా తెలా అనుకునే నీ హిపొక్రసి
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే...

గృహిణిగా, తల్లిగా నీ కర్తవ్య నిర్వహణ కోసం
నువు చంపుకున్న నీ కళలు, నీ అభిరుచులు,
పెట్రియార్కల్ ఇన్సెన్సిటివిటీస్ పుణికి పుచ్చుకున్న
నీ పిల్లలు నీ పట్ల చూపే అవసరార్ధ ప్రేమలు,
నీకంటూ ఉన్న అభిరుచుల్ని గౌరవిస్తున్న మరో మనిషిపై నీకున్న అభిమానాన్ని 
తేల్చుకోలేక, చంపుకోలేక, ఎథికల్ ఎరీనాలో ఏమీ చేయలేక, మౌనంగా ఆరాధించే నీ క్యారెక్టర్ సాక్షిగా... 
నిన్నొక డెపెండెంట్, సెంటిమెంటల్, ఇడియాటిక్ లూసర్ గా
నిలబెట్టినా, ఈ సమాజం నిన్నెపుడూ ఒక ఆదర్శ గృహిణిగానే గౌరవిస్తుంది
అవును నీది ఆదర్శ దాంపత్యమే, నువు ఆదర్శ గృహిణివే...

Wednesday, July 22, 2015

కన్నీరు .....

కొన్నిసార్లు అత్యంత బాధకరంగా అనిపిస్తూ ఉండే విషయము
ఉద్భవించిన కన్నీరు కాదు
రాలిపోయిన కన్నీరు కాదు
రాలి పడటానికి .. ఉద్వేగం సరిపోక
నిక్షిప్తం చేసుకోవడానికి .. నిస్తేజం సహకరించక
కళ్ళ తీరాన తారట్లాడే కన్నీరు .....

Monday, July 20, 2015

వెన్నెల విరహం - 3

ఎంత ఆర్తిగా హత్తుకుంటాయి నీ తలపులు ?
ఎన్నో రాత్రులని దొర్లించేస్తూ
ఒకోసారి మదికి నీ చల్లని స్పర్శేదో తాకినట్లుంటుంది
మరోసారి చెమ్మగిల్లిన చూపులు చూస్తుంటుంది

కొన్ని నిర్జీవక్షణాలని ఒంపుకుంటూ
నిశబ్ద సంగీతాలు నన్నావరిస్తుంటే
కొన్ని ఆకులు రాల్చిన ఆ చెట్టు పై
నల్లని వెన్నెలని చూస్తుంటా

కొన్ని రాత్రులని దగ్ధం చేసి
వెలుతురు కోసం ఎదురుచూస్తూ
కొన్ని తీపి సముద్రాల్ని తాగి
ఊరడించుకుంటా నువ్వొచ్చేస్తావని

జీవించడం నేర్పిన నువ్వు
నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో చెప్పలేదు
వియోగపు అనుభూతులు మధురమే

నా గుండె నీ జ్ఞాపకాల సవ్వడి చేస్తున్నంతవరకు...

Thursday, July 16, 2015

వెన్నెల విరహం - 2

నిన్ను గుర్తు చేసుకోకూడదనుకున్నా 
శ్వాస తీసుకోవడం మరవలేను కదా 
నీ తలపులు నా మది తలుపు తట్టకూడదనుకున్నా 
గుండె చప్పుడు ఆగినప్పుడే అని తెలుసుకున్నా

కొన్ని విరిగిన పుల్లలు 
నల్లని గీతలు గీస్తుంటాయి 
కొన్ని తేనె ఆకులు 
మదికి లేపనం పూస్తుంటాయి 

నీ ప్రేమ పరుసువేది ,
తాకిన నా మది బంగారమే 
కాని దాని మెరుపంతా,
నువ్వు పక్కన ఉన్నప్పుడే

ఎదురుచూస్తున్నా 
వెన్నెల పుష్పాలు కురుస్తుంటే 
అలలొచ్చి పాదాలను తడుపుతుంటే 
నీతో చేరి , ఆ నక్షత్రాలని లెఖ్ఖపెట్టాలని...

Tuesday, July 14, 2015

వెన్నెల విరహం - 1

కొన్ని విరిగిపోయిన క్షణాలు
గుండెలో ఒలికిపోతుంటాయి 
వెలిసి పోయిన మది గోడలకి
నీ జ్ఞాపకాలు వేలాడుతుంటాయి

వెదురుని వేణువు చేసావు
గాయాలుంటాయనుకోలేదు
సంగీత స్వరాలు తెలీవు 
నీ పిలుపు చాలు... నా మది ఆలాపనకి

అలవోకగా తాకి వెళ్ళిపోతుంటాయి నీ తలపులు...
మది మటుకు భారమైన కరి మేఘంలా
నిదురపోని నీ జ్ఞాపకాలు
కలలో కూడా కలవరపెడుతూ

ఎండిన ఎడారుల్లో
తొలకరి జల్లులే నీ చిరునవ్వులు
కురిపిస్తావు కదా
దేహం మట్టి దుప్పటిని కప్పుకునే లోపు

Monday, July 13, 2015

చిత్ర సమీక్ష - రాజమౌళీ - బహు బాగు భళీ..!

రాజమౌళీ - బహు బాగు భళీ..!

నా మొదటి సినిమా రివ్యూని ఒక ఎపిక్ మూవీ తో మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది...


ఒక సినిమాకి టీం అంతా పడిన మూడేళ్ళ కష్టం, జూలై 10 న, మన ముందుకొచ్చింది. మీడియా ఇచ్చిన హైప్ ని రాజమౌళి ఒప్పుకున్నాడో, తన కెరీర్ గ్రాఫ్ వల్ల, తనే క్రియేట్ చేసుకున్నాడో కానీ, ముందునుంచీ ఇదే క్రేజ్ ఉండింది. ఇక విశ్లేషణ / వివరాల్లోకి వెళ్తే...

బేసిగ్గా, నేను ఎవ్వరికీ ఫ్యాన్ ని కాదు, ఏ.సి అంతకన్నా కాదు. కాబట్టి, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎవరినీ నొప్పించడానికి కాదు.

సీన్ ఓపెన్ చేస్తే... మన్నెంలో పెరిగిన శివుడు చిన్నప్పట్నుండీ అనుకున్నది సాధించే ప్రక్రియలో, నీటి బండని ఎక్కి, అవంతికని కలవడం, దేవసేనని విడిపించాలన్న తన ఆశయాన్ని, శివుడు తన ఆశయంగా చేసుకుని, తద్వారా, మాహిష్మతి రాజ్యానికి వెళ్ళడం... అక్కడ జనం తనని బాహుబలిగా గుర్తించడం, భల్లాలదేవుడి చెర నుండి, దేవసేన ని విడిపించే ప్రయత్నంలో జరిగిన యుద్ధంలో కట్టప్ప బాహుబలిని గుర్తించి, తన గురించి చెప్పడం... ఫ్లాష్ బ్యాక్ లో, రాజమాత అయిన శివగామి, దాయాదుల పిల్లలిద్దర్నీ సమంగా పెంచి పెద్ద చేసి, భర్త కుటిల రాజకీయాలనుండి రాజ్యాన్ని రక్షించడం... ఈ లోపు కాలకేయుడి దండయాత్ర నుండి, రాజ్యాన్ని రక్షించిన వారికి పట్టాభిషేకం అని ప్రకటించడం... బిజ్జలదేవుడి పక్షపాత ధోరణి, ప్రయత్నాలు ఫలించక... అమరేంద్ర బాహుబలినే రాజుని చెయ్యడం... ఇలా మొదటి భాగమంతా ఉత్కంఠగా సాగుతుంది... క్లైమాక్స్ లో, మరి అంతటి వీరుడు ఎలా చనిపోయాడు అన్నప్పుడు... నమ్మకానికి మారుపేరయిన కట్టప్ప చెప్పిన నిజంతో సినిమా మొదటి భాగం ముగుస్తుంది... స్థూలంగా ఇదీ కథ...

 నిజానికి ఆ ముగింపు చాలా పర్ఫెక్ట్ కానీ భరించలేనిది... సాధారణంగా రాజమౌళి సినిమాల్లో, ప్రతీ పదిహేను నిమిషాలకి ఒకసారి, ఒక థ్రిల్లింగ్ లేదా కామెడీ లేదా ఎమోషనల్ ఎలిమెంట్ ఉండేలా చూసుకుంటాడు... అప్పుడే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు... అని తను ఒకసారి అన్నాడు... కానీ ఈ సినిమాలో అలాంటిదేమీ ఉన్నట్టు అనిపించదు...
ఫస్ట్ హాఫ్ అంతా తమన్నాని కలిసి, కన్విన్స్ చేసి, తన ఆశయం తెలుసుకుని, ఆ రాజ్యానికి వెళ్ళడం సరిపోతుంది. తమన్నా ఫైట్స్ కొంచెం కామెడీగా అనిపించినా, ప్రభాస్ శివలింగాన్ని మోసుకెళ్ళే సీన్, జలపాతం ఎక్కే సీన్ లాంటివి అతిశయోక్తి అనిపించినా, ఆ బాడీకి ఓకె అనిపిస్తుంది. ధీవర పాటలో చేసిన విన్యాసాలు... మంచు తుఫాన్, కోట సెట్టింగ్స్... విగ్రహావిష్కరణ సీన్... రానా ఇంట్రో లో బుల్ ఫైట్... ఇలా ప్రతీ సీన్ లోనూ రాజమౌళి కనిపిస్తాడు... లాజిక్ లు వెతకకుండా సినిమాకెళ్తే ప్రతీ సీన్ కట్టి పడేస్తుంది...
మనం చందమామ పుస్తకంలో ఎన్నో జానపద కథలు చదువుతాం... అప్పుడు మన ఊహల్లోని తోటరాముడు ఎన్ని సాహసాలు చేసినా ఊహించుకుని మురిసిపోతాం... మరి సినిమాలో చూపిస్తే లాజిక్కులు ఎందుకు వెతకాలి ? కొండని చీల్చి, దొప్పలా చేసి, మంచుతుఫాన్ నుండి తప్పించుకోవడం ఒక్కటే, కొంచెం ఎక్కువనిపించినా, లార్జర్ దాన్ లైఫ్ సినిమాలో ఇవన్నీ సబబే అనిపించేలా చేసాడు రాజమౌళి.

ఇక క్యాస్టింగ్ - ఈ పాత్ర కి వీళ్ళు అని ఎలా తీసుకున్నాడో గానీ, వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ సరితూగరనిపిస్తుంది. ముఖ్యంగా శివగామి, కట్టప్ప, బిజ్జలదేవుడు, భల్లాలదేవుడు, బాహుబలి - ఇలా... ప్రతీ పాత్రలో వారు ఒదిగిపోయారు... నరసింహ తరువాత, రమ్యకృష్టకి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ దొరికింది. తన రాజసంతో, పాత్రకి ప్రాణం పోసింది... కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ లాంటి మనిషి ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఒక్కరుంటే ఎంత బావుంటుంది అనిపించేలా ఉంది.

ఇక నెగిటివ్స్ : మంచు తుఫాన్ సీన్ చూసి - ద స్పై హు లవ్డ్ మీ, యుధ్ధం సీన్లు చూసి - కన్ఫ్యూషియస్, ఇలా హాలీవుడ్ సినిమాల కాపీ అని విమర్శించే వారికి నాదో విన్నపం. ఇదే సినిమాని హాలీవుడ్ వాళ్ళు తీసి తెలుగులోకి డబ్ చేసి వదిలితే, ఏం టెక్నాలజీ అని తెగ ఎత్తేస్తాం... చందమామ కథల పుస్తకం నచ్చదు కానీ హ్యారీపాటర్ సిరీస్ అన్నీ చదువుతాం... ప్రభాస్ ఎగిరితే వింత... బ్యాట్ మాన్ ఏం చేసినా కళ్ళింత చేసి చూస్తాం... పొరుగింటి పుల్లకూర రుచి... బాలేకపోతే, ఐ అయినా, లింగా అయినా తిప్పి కొట్టాం... ఇదీ అంతే... భారీగా ఎక్స్పెక్ట్ చేసి, ఏదో లేదని ఫీలయ్యే వాళ్ళు, ఆ లోటేంటో తెలుసుకోండి... బ్రహ్మానందం ని శత్రువుల ఇంట్లో చేర్చి, కుమ్మించి వదిలితే తప్ప మనకి సినిమాలో కామెడీ తెలీదు. హీరో ఎంత బక్క పల్చగా ఉన్నా, వందమందిని, ఆయుధం లేకుండా, చంపగలిగిన హీరోల్ని చూసి... నిజంగా దేహ దారుఢ్యం ఉన్నవాళ్ళు చేసే సాహసాల్ని ఒప్పలేమేమో ? అనిపిస్తుంది... స్టోరీ పెద్దగా లేదనేవారు, ఈ మధ్య వచ్చిన గొప్ప స్టోరీల్ని ఒక్కసారి తిరగెయ్యండి... హీరో హీరోయిన్... మాఫియా సెటప్, హెలికాప్టర్ లో బ్యాంకాక్ లో ఉండే విలన్... పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్... ఇంత రొటీన్ స్టోరీ కూడా వెరైటీ యే... కానీ జానపద బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ కథ చాలా రొటీన్ అనిపిస్తే ఖచ్చితంగా మనం మూసకి అలవాటు పడ్డట్టే...


ఇక టెక్నికల్ సపోర్ట్... కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం రెండూ బావున్నాయి... ఇంకొంచెం బావుంటే ఇంకా కీలక సన్నివేశాలు అద్దిరిపోయేవి. కెమెరా, సెట్టింగ్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ చిన్న చిన్న విషయాలు కూడా చాలా శ్రధ్ధ తీసుకుని చేసినట్టు తెలుస్తుంది... ముగింపు చూసాక అనిపించిందేంటంటే, ఆకలిగా ఉన్నవాడికి, పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టి, పప్పు, కూర తిన్నాక, కాసేపాగి తిందువులే అని కంచం లాగేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది...
నాకు మాత్రం సినిమా -  రెండు సార్లు చూసినా మొదటి నుండి చివరిదాకా ఎక్కడా - బోర్ కొట్టలేదు - ప్రతీ సీన్ నచ్చింది...
సో... ఈ రివ్యూ కూడా అసంపూర్ణంగానే ముగిస్తున్నా... రెండో భాగం చూసాక పరిపూర్ణంగా ఒక వ్యూ తో మళ్ళీ ఓ రివ్యూ రాస్తా...!
ఓవరాల్ గా, తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన - రాజమౌళీ - బహు బాగు భళీ..!